22, ఆగస్టు 2009, శనివారం

saarasvataniketanam

సారస్వత నికేతనం

సారస్వత నికేతనం ప్రకాశం జిల్లా వేటపాలెం లోని తెలుగు గ్రంధాలయము.

తెలుగు భాషకు 80 సంవత్సరాలుగా మహోన్నత సేవలు చేసిన ఈ గ్రంధాలయము చాలా మంది సాహితీకారులకు కుడా తెలియదంటే నమ్మశక్యము కాదు.

ఈ గ్రంథాలయము అక్టోబరు 15, 1918 లో వి.వి.శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్లా ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం. మహాదాత, గాంధేయుడు గోరంట్ల వెంకన్న గ్రంథాలయమునకు మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు.

ఏదైనా తెలుగు పుస్తకము వెతకడములో ఇంతవరకు మీ ప్రయత్నాలు సఫలముకాకపోతే వేటపాలెం సారస్వత నికేతనంలో ఆ పుస్తకము దొరికే అవకాశము ఉన్నది. ఈ గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్ లో పరిశోధనా-ఓరియంటెడ్ గ్రంథాలయాలలో అగ్రగణ్యమైనది. ఈ గ్రంథాలయానికి 1929 లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. స్వాంతంత్ర్యోద్యమ కాలములో ఎందరో యువకులకు స్పూర్తి ప్రదాత అయినది. ఆ తరువాత కాలములో వచ్చిన ముఖ్య మంత్రులు మరియు ఎందరో విద్యావేత్తలు గ్రంథాలయమును సందర్శించారు.

ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ కలదు. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి కలవు. 70,000 కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. ఈ గ్రంథాలయము తన చుట్టు ఉన్న ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితము చేసినది. విద్య మరియు సమాజ కళ్యాణ ఉద్యమాలెన్నింటికో కేంద్రబిందువైనది. ఈ గ్రంథాలయము అందరికీ అందుబాటులో ఉన్నది. చిన్న ఒక అంతస్థు భవనము నుండి ప్రస్తుతము ఇది రెండంతస్థుల భవనముగా ఎదిగినది.

గ్రంధాలయం అభివృద్ధిలో కొన్ని ముఖ్య ఘట్టాలు

1918 అక్టోబరు 15 స్వర్గీయ శ్రీ. వి.వి. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంధాలయాన్ని స్థాపించారు.

1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంధాలయాన్ని తరువాత 'సారస్వత నికేతనం' అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని స్వర్గీయ శ్రీ. జమ్నాలాల్ బజాజ్ గారు ప్రారంభోత్సవం చేశారు.

1927 లో ఈ గ్రంధాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడినది.
1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, జాతిపిత మహాత్మా గాంధి, చేసారు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించారు.

1930 ఈ గ్రంధాలయం, జిల్లా కేంద్ర గ్రంధాలయంగా గుర్తింపు పొందినది.
1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంధాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన జేశారు. ఇదో జ్ఞానమందిరంగా అభివర్ణింపబడినది.

1936 గాంధీగారు రెండో సారి విచ్చేశారు.
1942 గుంటూరు జిల్లా గ్రంధాలయాల సభ జరిగినది.
1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం.
1949 6వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగినది.
1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు.

1975 శ్రీ. ఏ.శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి, హైదరాబాదులో జరిగిన, ప్రపంచ తెలుగు మహాసభలలో గౌరవించబడ్డారు.

1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రము
సుందరయ్య విజ్ఞాన కేంద్రము 1988 లో హైదరాబాదు లో స్థాపించబడినది. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య యొక్క సొంత సేకరణలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయము ఆ తరువాత బెజవాడ గోపాలరెడ్డి వంటి అనేకమంది ఇతరుల యొక్క సొంత సేకరణలు కూడా కలుపుకొని అభివృద్ధి చెందినది. వామపక్ష రాజకీయ కార్యకర్తలు మరియు రచయితల సొంత రచనలు ఈ సేకరణలో ప్రత్యేకత. కేవలము సుందరయ్య రచనలే దాదాపు లక్ష పుటలకు పైగా ఉన్నాయి. పరిశోధనా గ్రంథాలయములో 75,000 కు పైగా తెలుగు మరియు ఆంగ్లములో ముద్రితమైన సంపుటిలు కలవు. ఈ కేంద్రము ఉర్దూ పరిశోధనా గ్రంథాలయము పేరిట ఉర్దూ పుస్తముల సేకరణలు కూడా భద్రపరుస్తున్నది. దక్షిణ ఆసియాలోనే అద్వితీయమైన ఈ సేకరణలో 17వ శతాబ్దము నుండి ముద్రితమైన 30,000 పుస్తకాలు, జర్నల్లు, పత్రికలు, మాన్యుస్క్రిప్టులు కలవు.

కధా నిలయం

కధా నిలయం, తెలుగు కధల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.

1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000 పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.

ఇంకా కధానిలయంలో 2,000 పైగా కధల సంపుటాలు, కధా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910 లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కధలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధా ఏదో ఒక దృక్పధాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి